Thursday, January 14, 2016

కడబాల " స్వీయచరిత్ర "


🙏🙏 స్వీయ చరిత 🙏🙏

❶ పోలమానుగొంది పూర్వీకులూరున
అయ్య అలిగి వచ్చె యార్లగడ్డ
పూట గడుపుడంత వంటి రెక్కల పంట
గొప్ప చెప్పుకొనుట ఒప్పు గాదు. 

❷ చిన్న పల్లె గలదు చింత్కర్రపాలెము
నెల్లి కోట రెడ్ల చెల్లి అమ్మ
పలుకు నింటి పేరు “పల్లాల”వారని
రీతియైన కొండరెడ్డి బిడ్డ. 

❸ యార్లగడ్డ నాకు అడ్రస్సు నిచ్చింది
పాడి పంటలు గల పల్లె మాది
కదిలి మెదిలి నాను కడబాల వారింట
వాసికలిగి నట్టి వంశ మందు

❹ అక్షరాలు రాని ఆదిదంపతులకు
కాయకష్టము పడు కార్మికులకు
కలిగితినిగదయ్య కడసారి బిడ్డగా
విశ్వనాథ చలువ వీక్షణముల. 

❺ చదువు రాని నాన్న కొదువలేదు ప్రేమ
చదువు కొరకు నన్ను వదిలినారు
తప్పటడుగులేస్తు తాటాకు బళ్ళోకి
పలకబలపములతొ పయనమైతి. 

❻ గుడిసెఅబ్రహాము గురువర్యుల చలువ
పట్టి నేర్చు కొంటి పద్య కవిత
తప్పు లెంచకుండ దయ చూపుడోయంత
నిండు దీవెనలను మెండు గిచ్చి

❼ ఊహ లేని నాడు ఊయల పాటలు
     నేర్పిన తొలి గురువు నేస్తమమ్మ
     అమ్మ కన్న కలల అర్థమిపుడు తీరె
      పూర్వజన్మ లోని పుణ్య ఫలము. 

❽ పద్యములను పడితి బద్నాలుగవ యేట
     విస్మరించి నాను వింతగాను
     బాల్యమున కలిగెను “బాలకవి”బిరుదు
      ఒజ్జలంత నన్ను ఉద్దరించ. 

❾ స్ఫూర్తి నిచ్చె నాకు కార్తికేయశ్శర్మ
     అల్లు శతక మొకటి అందముగను
     గురువు గారి వాక్కు గుర్తుగా వ్రాస్తున్న
     మన్నె బిడ్డ మాట మంచి బాట

❿ గుండెజబ్బు వాన్ని గుర్తున్నదా మీకు
      కోసి అతికి నారు కొత్త నరము
      దరికి చేర్చు కోండి దయతోడనను మీరు
      ఆదరించి నన్ను ఆదుకొనుడు

⑪ బతుకు బండి మోయు బడి పంతులయ్యను
    ముద్దు బిడ్డ లేమొ ముగ్గురయ్య
    భార్య బిడ్డ కొరకు బండి లాగుడు నాది
     తప్ప దెవరికైన తిప్పలన్ని. 

⑫ సుఖదుఃఖములు నాకు చూపె మహత్తులు
      నుదిటి రాత మార్చ నెవరి తరము
      దుక్క వంటి నేను నక్కనైతిని నేడు
      తనువు చాలు వరకు తప్ప దింక . 

⑬ చక్కనైన వనిత సహథర్మఛారిణీ
మంచి మనసు కలది మైత్రి కలది
పేరు పిలువ గాను బేబీ మహాలక్ష్మి ! 
ఒద్ది కయిన మహిళ బుద్ది కలది. 

⑭ ప్రథమ పుత్రుడేమొ “పైడి”సమానుడు
“శివ కుమారు”పేరు సిరుల మూట
ఇలన వేల్పు “శివుని” ఋణము తీరు దిశన
పేరు పెట్టి నారు పెద్ద లంత. 

⑮ ఇంజనీరు విద్య నెంచు కున్నాడులే
ఓర్పు నేర్పు తోడ ఉత్తముడుగ
మనసు పెట్టి చదివె మైనింగు విద్యను
విధుల జేరి నాడు విత్తు కొరకు

⑯ వైద్యవిద్య చదువు వాణి దివ్యారాణి
ఒకతె ఆడ బిడ్డ ఓర్పు కలది
చదువు పిచ్చి తనకు సఖ్యతనేకోరు
మనసు వెన్న తీరు మాట పొదుపు. 

⑰ చివర పుట్టినతడు “శివసాయి”తనపేరు
కష్ట పెట్ట డెపుడు కార్యశీలి
నాన్న అడుగు జాడ, నాణ్యతమరువడు
తల్లి మనసు నెరిగి తరయువాడు! 

⑱ పట్టు పురుగు పెంచు పట్టు సాధించాను
అధిక దిగుబడిచ్చు ఆకు పెంచి
పంట సాగు జేయు పద్ధతి నేర్చాను
నారు మడులు కట్టి నాట్లు వేసి

⑲ తాతతండ్రులంత వెతలబతుకులాయె
పెట్టి నాను గోడ మట్టి పిసికి
బాల్యమందు కొన్ని బాధలే పడ్డాను
అయ్య చచ్చి పోయె అమ్మ మిగిలె

⑳ దిక్కు లేని బతుకు దీనాతి దీనము
అయిన వారు లేరు ఆశ లేదు
చెడ్డ చెలిమి పట్టి చెడి పోవు సమయాన
అమ్మ నన్ను జేర్చె ఆశ్రమమున

21) తల్లి వాణి చలువ దక్కించు కున్నాను
మెట్టు మెట్టు ఎక్కి మెరుగు పొంది
నేను తప్ప పల్లె నొవరు చదివిలేరు
మాయ కాదు రన్న మహిమ లేదు

22) చదువు వారి కంత శతకోటి దండాలు
సౌఖ్యమీయ వయ్య చదువు వార్కి
విధిగ నన్ను గాయు విశ్వనాథప్రభో
దండమోయి నీకు దండమొపుడు ! 

      

1 comment:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete